Chandrababu: వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పు చేసింది.! 4 d ago

AP: ముప్పాళ్లలో 64 మందికి ఇళ్లు లేవని, వారందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో జనాభా పెరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో వృద్ధులు పెరిగిపోతారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదొక సమస్యగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసిందని, నాయకుడు అనే వాడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుందని పేర్కొన్నారు. ఆనాడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించామని, దీంతో ఇప్పుడు తెలుగు వారు ప్రపంచంలోని ప్రతి దేశంలో సత్తా చాటుతున్నారని చెప్పారు.
ఆర్థికంగా పైకి వచ్చిన వారు ఎదగలేని వారిని ఆదుకోవాలని, అందుకోసమే పీ - 4 విధానాన్ని తీసుకొచ్చామన్నారు. కిడ్నీ, లెప్రసీ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నామని, మంచానికే పరిమితమైన రోగులకు రూ.15 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పరిస్థితుల్లో ఉందని, గత వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని, నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుంటుందని తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారని, అందరి భవిష్యత్ బాగుండాలన్నదే తమ ఆలోచన అన్నారు. భారత దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని, అందుకే రెండోతరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.